Wednesday, July 17, 2019

పాక్ కొత్త డ్రామా! పాక్ వైఖరిలో మార్పు వెనుక మర్మమిదేనా?


పాక్ కొత్త డ్రామా!
17-07-2019 21:44:26

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ క్రమంగా దిగి వస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ తలపడకుండా తగ్గుతున్నాడు. నిన్న ఎయిర్‌ స్పేస్‌ తెరుచుకుంది. ఇవాళ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఎందుకీ పరిణామాలు? పాక్ కొత్త డ్రామా వెనుక దాగిన నిగూఢమేంటి?

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


పాకిస్తాన్‌ వ్యవహారశైలి కొంతకాలంగా మారుతూ వస్తోంది. అంతర్జాతీయస్థాయిలో ఈ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా భారతదేశం పట్ల అనుసరిస్తున్న తీరు ఆలోచనలో పడేస్తోంది.

ఆవేశంలో విధిస్తున్న ఆంక్షలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కయ్యానికి కాలుదువ్వే గత చరిత్రకు భిన్నంగా ముందుకెళ్తున్న సందర్భాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. మొత్తానికి భారత్‌తో తలపడకుండా.. తగ్గుతున్న ఆనవాళ్లు దాయాది దేశం తీరులో ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి.

మొన్నటికి మొన్న పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించింది పాకిస్తాన్‌ సైన్యం. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై నెలకొన్న ప్రతికూల భావనలను తగ్గించేందుకు ప్రయత్నించింది. జెనీవా ఒప్పందాన్ని పాటించి.. తమ సైన్యానికి చిక్కిన 80 గంటల్లోనే అభినందన్‌ను అధికారికంగా భారత్‌కు అప్పగించింది.

ఇప్పుడు 24 గంటల వ్యవధిలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్‌. బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల తర్వాత తమ గగన తలాన్ని మూసేసిన పాకిస్తాన్‌.. అనూహ్యంగా.. తమ ఎయిర్‌స్పేస్‌ను తెరుస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. మరుసటిరోజే.. అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను అరెస్ట్‌ చేసింది. ఈ రెండు పరిణామాలు పాకిస్తాన్‌ వైఖరిపై అంతర్జాతీయంగా చర్చను లేవనెత్తాయి.

2008 ముంబై మారణహోమం ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధికారులు అరెస్టు చేశారు. వెంటనే జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లాహోర్ నుంచి గుజ్రన్‌వాలాకు వెళ్తుండ‌గా.. మార్గమ‌ధ్యలో అధికారుల‌ను హఫీజ్‌ను త‌మ అదుపులోకి తీసుకున్నార‌ని జ‌మాత్‌-ఉద్‌-ద‌వా సంస్థ అధికార ప్రతినిధి ఒక‌రు వెల్లడించిన‌ట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఉగ్రవాద కార్యక్రమాలకోసం నిధులు సేకరించాడనే అభియోగంతో హఫీజ్‌ను పాకిస్తాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. జులై మొదటివారంలోనే హఫీజ్‌పై ఈ అభియోగాలు నమోదయ్యాయి.

ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు చెబుతున్నదాని ప్రకారం పంజాబ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో హఫీజ్‌ సయీద్‌తో పాటు.. అతని అనుచరులు 13 మందిపై 23 కేసులు నమోదయ్యాయి. స్వచ్చంద, సంక్షేమ సంస్థల పేరుతో అనేక సంస్థలను ఏర్పాటు చేసిన హఫీజ్.. భారీగా నిధులు సేకరించి ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడినట్లు యాంటీ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పంజాబ్ ప్రకటించింది. యాంటీ టెర్రరిజం యాక్ట్ 1997 ప్రకారం హఫీజ్‌తో పాటు మరో 12మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది.

రెండు రోజుల కిందటే హఫీజ్‌ సయీద్‌‌‌తో పాటు మరో ముగ్గురికి ఆగస్టు 31వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పునిచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా లష్కర్-ఏ-తోయిబా మిలిటెంట్ గ్రూపును 1990లో హఫీజ్‌ సయీద్ ఏర్పాటు చేశాడు. ఆ సంస్థపై నిషేధం విధించిన తర్వాత, 2002లో జమాత్ ఉద్ దవా అనే మరో సంస్థను స్థాపించాడు. ప్రస్తుతం "జుద్" అనే ఇస్లామిక్ సంస్థను నడుపుతున్నాడు హఫీజ్‌. హఫీజ్‌ అనుచరులతో పాటు.. పాకిస్తాన్‌లోని పలు సంస్థలు దాన్ని సంక్షేమ సంస్థగా చెబుతున్నారు. కానీ.. అది సంక్షేమ సంస్థ కాదని, ఉగ్రవాద కూటమి అని అమెరికా, భారత్‌ సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి.

2008 న‌వంబ‌ర్ 11వ తేదీన దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ముంబై రైల్వేస్టేష‌న్, తాజ్ హోట‌ల్ స‌హా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు నిర్వహించిన మెరుపుదాడుల్లో 165 మంది మ‌ర‌ణించారు. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి హ‌ఫీజ్ స‌యీద్‌. దాడుల సంద‌ర్భంగా మ‌న‌దేశ భ‌ద్రతా ద‌ళాల చేతికి స‌జీవంగా దొరికిన ఉగ్రవాది క‌స‌బ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఈ విష‌యాన్ని నిర్థారించారు. ఈమేరకు పాకిస్తాన్‌కు అవసరమైన ఆధారాలన్నీ భారత్‌ అందించింది. మరోవైపు పాకిస్తాన్‌లో సైతం హ‌ఫీజ్ స‌యీద్‌పై 23 కేసులు న‌మోద‌య్యాయి. అగ్రరాజ్యం అమెరికాపై దాడి చేసిన అల్‌ఖైదా వ్యవ‌స్థాప‌కుల్లో ఒక‌డైన హ‌ఫీజ్‌ సయీద్‌ను అరెస్టు చేయాలంటూ అంత‌ర్జాతీయంగా ఒత్తిడి వ‌చ్చిన‌ప్పటికీ.. ఆ దిశ‌గా పాకిస్తాన్ ప్రభుత్వం ఏనాడూ చ‌ర్యలు తీసుకోలేదు. అయితే.. ఇప్పుడు హఫీజ్‌ను అరెస్టు చేయ‌డం అంతర్జాతీయ స్థాయిలో చ‌ర్చకు దారితీసింది.

మరోవైపు.. సరిగ్గా ఒక్కరోజు ముందే పాకిస్తాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ దాడులను కారణంగా చూపి మూసేసిన గగనతలాన్ని మళ్ళీ తెరిచింది. బాలాకోట్ దాడుల తర్వాత మూసివేసిన తమ ఎయిర్ స్పేస్‌ను మళ్లీ తెరుస్తున్నట్లు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ - సీఏఏ ప్రకటించింది. పాక్ గగనతలాన్ని తక్షణం తెరుస్తున్నట్లు మంగళవారం ఉదయం అథారిటీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో చెప్పింది.

ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడికి సమాధానంగా ఫిబ్రవరి 28న భారత్ బలగాలు బాలాకోట్‌లో వైమానిక దాడులు చేపట్టాయి. ఆ తర్వాత పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసేసింది. పాకిస్తాన్ నిర్ణయంతో ఇన్నాళ్లు నష్టాలు ఎదుర్కొన్న భారత ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ను మూసేయడంతో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలు వేరే మార్గంలో వెళ్లాల్సొచ్చింది. చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని ఎయిర్‌ ఇండియా భరించింది.

అయితే.. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలోని ఎయిర్‌మెన్ భారత కాలమానం ప్రకారం మంగళవారం సుమారు 12 గంటల 41 నిమిషాలకు ఒక నోటీస్ జారీ చేసింది. అందులో పాకిస్తాన్ గగనతలాన్ని అన్నిరకాల పౌర విమానాల కోసం తక్షణం తెరుస్తున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేసిన తర్వాత భారత విమాన సంస్థలు, ప్రధానంగా ఎయిర్ ఇండియా రోజూ కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కొన్నాయి.
భారత పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈనెల 3వ తేదీన ఈ అంశానికి సంబంధించి రాజ్యసభలో కొన్ని గణాంకాలు ప్రవేశపెట్టారు. అందులో ఎయిర్ ఇండియాకు జులై 2వ తేదీ వరకూ 491 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు చెప్పారు. పాక్ నిర్ణయం వల్ల ప్రైవేటు ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్‌కు 30.73 కోట్లు, ఇండిగోకు 25.1 కోట్లు, గో ఎయిర్‌కు 2.1 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

పాక్ తమ ఎయిర్ స్పేస్ మూసేసిన తర్వాత యూరప్, అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు చుట్టూ తిరిగి సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు.. పలు అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పాకిస్తాన్‌ చేసిన ప్రకటన తర్వాత.. భారత మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కూడా రెండు దేశాల గగనతలంపై ఎలాంటి ఆంక్షలూ లేవని అధికారిక ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ప్రకటించింది.

-సప్తగిరి.జి (ఏబీఎన్‌ రెడ్‌ అలర్ట్‌ డెస్క్‌ ఇంచార్జ్‌)

పాక్ వైఖరిలో మార్పు వెనుక మర్మమిదేనా?
17-07-2019 23:22:59

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అనుసరిస్తున్న ఈ వైఖరికి ప్రధాన కారణమేంటి? రెండు రోజుల్లోనే రెండు కీలక నిర్ణయాల వెనుక మర్మమేంటి? భారత్‌ విషయంలో క్రమంగా నిర్ణయాల్లో మెతకవైఖరి అవలంబించడానికి దారితీస్తున్న పరిస్థితులేంటి?

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉన్న విభేదాలు కాస్తంత సద్దుమణిగాయి. కారణం లేకుండా కయ్యానికి కాలుదువ్వే దాయాది దేశం వైఖరిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. సోదరదేశం భారత్‌ పట్ల క్రమంగా మెతక వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా అంతర్జాతీయ సమాజానికి ఈ సంకేతాలు వెళ్లేలా జాగ్రత్త వహిస్తోంది. ఫలితంగా కొన్నాళ్లుగా స్నేహ హస్తానికి తాపత్రయ పడుతున్నట్లుగా అర్థమవుతోంది.

వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికైన నాటినుంచి భారత్‌పై వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. అసలే సంక్షోభ కాలంలో పాకిస్తాన్‌ గద్దెనెక్కిన ఇమ్రాన్‌.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కాస్త జాగరూకత వహిస్తున్నారు. స్వతంత్రంగా వ్యవహరించే పాకిస్తాన్‌ దేశ సైన్యం ఆలోచనల్లో కూడా తనదైన ముద్ర కనిపించేలా చేస్తున్నారు. అయితే.. మొదట్లో కంటే.. కొద్దిరోజులుగా పాక్‌ ప్రభుత్వ నిర్ణయాలు, జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చ లేవనెత్తే స్థాయిలో ఉంటున్నాయి.

ఇటు.. భారత్‌ వైపు నుంచి చూస్తే.. ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి హస్తిన గద్దెనెక్కిన తర్వాత మరింత దూకుడుగా ముందుకెళ్తున్న సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్‌తో అసలు సమస్య అయిన కశ్మీర్‌ వ్యవహారంలో వ్యూహాలు మారుస్తున్నారు. ఇటు.. అంతర్గతంగా తనదైన వ్యూహాలు అమలు చేసేందుకు సంసిద్ధమవుతూనే.. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.

ఇందులో భాగంగానే.. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల విభజన చేపట్టే సంచలన చర్యలకు ఉపక్రమించబోతున్నారని బీజేపీ శ్రేణుల అంతర్గత చర్చల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులోనూ.. మరింత లోగుట్టు దాగి ఉందని కూడా చెబుతున్నారు. ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌లో హిందూ జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో నియోజకవర్గాలు భారీగా పెరిగే అవకాశం ఉందని, అదే గనక జరిగితే రాజకీయ స్వరూపమే మారిపోయే అవకాశాలున్నాయంటున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగి.. తద్వారా అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈ పరిణామం దక్షిణాసియాలోనే సమీకరణాలు మార్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

కశ్మీర్‌ అంశంలో సాంకేతిక విషయాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆర్టికల్‌ 370 వంటి అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు ఖచ్చితంగా పాకిస్తాన్‌తో భారత్‌ సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే.. భారత్‌ దూకుడు పెంచుతున్న సమయంలో.. పాకిస్తాన్‌ మెత్తబడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతేకాదు.. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ఉగ్రవాద సవాళ్ళను భారత్ తన సంప్రదాయ సైనిక పాటవంతో సమర్థంగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉంది. కానీ.. ఎన్నిసార్లు పాకిస్తాన్‌ కవ్వించినా.. నిత్యం కవ్విస్తూనే ఉన్నా.. సైనిక చర్యల విషయంలో సంయమనం పాటించింది. పుల్వామా ఘటన జరిగే దాకా భారత్ కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిపే విధానాన్ని అనుసరించింది. కానీ.. పుల్వామా ఘటనతో భారత్‌ ఇన్నాళ్లుగా పాటించిన సంయమనానికి స్వస్తి చెప్పి ప్రతీకార చర్యకు దిగింది. ఈ పరిణామం పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చింది.

భారత్‌ వైఖరిలో వచ్చిన మార్పులు, రహస్య వ్యూహాలను గ్రహించిన పాకిస్తాన్‌.. వెనక్కి తగ్గుతున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంక్షలు, నిర్ణయాలను ఉపసంహరించుకుంటున్న సందర్భాలు కూడా దాయాది దేశం మారుతున్న ఆలోచనలకు సంకేతంగా నిలుస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే రెండు కీలక నిర్ణయాలు, నెలకొన్న పరిణామాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

-సప్తగిరి.జి (ఏబీఎన్‌ రెడ్‌ అలర్ట్‌ డెస్క్‌ ఇంచార్జ్‌)

No comments:

Post a Comment